Tuesday, November 24, 2015

ఆ ఆరు కాకులు ...

అనగనగా ఒక ఊరిలో ఆరు కాకులు ఉన్నాయి. వాటికి బాగా దాహం వేసింది. నీరు ఎక్కడా దొరకలేదు. కొన్ని కాకులు వెతగ్గా వెతగ్గా వాటికి ఐదు కుండలు కనపడ్డాయి. వాటిలో కొంచెం నీరు మాత్రమే ఉంది. ఐదు కాకులు ఐదు కుండల దగ్గరికి వచ్చాయి. కాని వాటికి నీరు నేరుగా అందే పరిస్థితి లేదు.
 అంతలో ఒక సాంప్రదాయ కాకి రాళ్ళ కోసం వెతికింది.కుండలొ రాళ్ళు వేస్తే రాళ్ళు తడుస్తాయి కాని నీరు అమాంతం పైకి రాదుగా..కాని ఇలాంటి కాకులు గుడ్డిగా సిద్దాంతాలను మాత్రమే నమ్ముకుని బ్రతుకుతున్నాయి..వాటికి దేశ కాల పరిస్థితితో సంబంధం లేదు...
 ఇంకో మధ్యతరగతి కాకి నీటిని అందుకోవాలన్న ఆశతో తన తల కుండ మూతిలో ఇరికించింది. ఆ ప్రయత్నంలో కుండ పడి పగిలి నాలుగు నీటి చుక్కలు దొరకవచ్చు లేదా నీటి మీద ఆశతో ప్రాణం పోవచ్చు..ఇలాంటి కాకులు ఎదో సంసారాన్ని  అలా ఈడ్చేస్తున్నాయి...
 ఇంకో రాజకీయ అవినీతి కాకి, కుండకి ఎమైతే నాకేమిటి అని, కుండ కింద ఒక రంధ్రం చేసి నీరు తాగింది. ఇలాంటి కాకులు వ్యవస్థని భ్రష్టు పట్టిస్తు తాము మాత్రం బాగుంటే చాలు అని బ్రతుకుతుంటాయి.
 ఇంకో తెలివైన కాకి ఎలాగోలా ఒక నాళిక (స్ట్రా) సంపాదించి నీరు తాగింది. ఇవి బ్రతక నేర్చిన తెలివైన కాకులు. ఎలాగైనా బ్రతికేస్తాయి.
 ఇక ఐదోది సొమరిపోతు కాకి..అవసరo ఉన్నా, అవకాశం ఎదురుగా ఉన్నా, ఎవరు వచ్చి నాకు అన్ని ఉచితంగా ఇస్తారా అని ఎదురు చూస్తూ కాలం గడుపుతుంది.. దాని దౄష్టిలో మొదటగా మిగిలిన నాలుగు కాకులు ఆ ఐదో కుండ ఎత్తి దాని నోట్లో నీరు పోయాలి ఆ తర్వాత వాటి పని అవి చేసుకోవాలి. ఇలాంటి కాకుల బ్రతుకు ఎప్పుడూ అలానే ఉంటుంది..
 ఇక చివరకు మిగిలినది మాధ్యమ (మీడియా) కాకి.. దీని గురించి వేదాలలోనే ఏమి చెప్పబడలేదు కాబట్టి మనం కూడా వీరిపట్ల "మౌనం అత్యంత శ్రేయోదాయకం" అనే సూక్తి పాటించడం ఉత్తమం.
--
వ్యాసవిరచితం 

No comments: